షాద్‌నగర్ సమీపంలోని చేగూరులో మళ్లీ కరోనా కలకలం రేగింది. ఇటీవల మరణించిన 50 ఏళ్ల ఓ మహిళ కరోనా వైరస్ బారిన పడినట్లు బయటపడటంతో చేగూరు వాసులు ఉలిక్కిపడ్డారు. ఏప్రిల్ 3న ఆమె మృతి చెందగా.. గ్రామంలో హై అలర్ట్ విధించారు. ఆమె కుటుంబ సభ్యులు, అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ఆమెను కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. తాజాగా ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.మహిళ కరోనా వైరస్‌తో మరణించడం వెనుక మర్కజ్ మూలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సదరు మహిళ ఇంట్లో అద్దెకు ఉండే బిహార్ యువకుల ద్వారా ఆమెకు వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. మహిళ ఇంట్లో నలుగురు బిహార్ యువకులు అద్దెకు ఉంటుండగా.. గత సోమవారం (ఏప్రిల్ 6) వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితుడిని చికిత్స నిమిత్తం తరలించారు. మిగిలిన వారిని క్వారంటైన్‌లో ఉంచారు.
ఈ నలుగురు యువకులకు స్నేహితుడైన బిహార్‌కు చెందిన మరో యువకుడు కొత్తూరులో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్తగా అతడిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. దీంతో పాటు చేగూరు పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల మేర హై అలర్ట్ విధించారు. వైద్యారోగ్య శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరీక్షలు నిర్వహించారు. చేగూరు పరిసర ప్రాంతాల్లో మొత్తం 1475 ఇళ్లలో 7 వేల మందిని అధికార బృందాలు పరిశీలించాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి అవసరమైన ఔషధాలు అందించారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
మరణించిన ఆ మహిళ భర్తకూ కరోనా